MOVIE REVIEWS

అల్లూరి

అల్లూరి

మూవీ రివ్యూ : ‘అల్లూరి’

నటీనటులు: శ్రీ విష్ణు-కాయాదు-తనికెళ్ళ భరణి-సుమన్-రాజా రవీంద్ర-పృథ్వీ-రవి వర్మ-మధుసూదన్ రావు-జయవాణి తదితరులు
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
ఛాయాగ్రహణం: రాజ్ తోట
నిర్మాత: బెక్కెం వేణుగోపాల్
రచన-దర్శకత్వం: ప్రదీప్ వర్మ

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు శ్రీ విష్ణును కొంత కాలంగా వరుసగా పరాజయాలు పలకరిస్తున్నాయి. ఈసారి అతను ఒక పోలీస్ కథను నమ్ముకున్నాడు. కొత్త దర్శకుడు రూపొందించిన ఆ చిత్రమే.. అల్లూరి. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అల్లూరి సీతారామరాజు (శ్రీవిష్ణు) సిన్సియర్ పోలీస్ ఇన్స్పెక్టర్. అతడికి డ్యూటీ అంటే ప్రాణం. దాని తర్వాతే ఏదైనా. తన నిజాయితీ వల్ల తరచుగా బదిలీలు అవుతూ.. చివరికి వైజాగ్ చేరుకుంటాడు. అక్కడ ఎంపీ కొడుకు అతడి మనుషులతో పెట్టుకోవడంతో రామరాజుకు ఇబ్బందులు తలెత్తుతాయి. అయినా వెనక్కి తగ్గడు. ఒక అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడిన ఎంపీ కొడుకు జనం మధ్య తగిన శిక్ష వేస్తాడు. చట్టాన్ని అతిక్రమించి అతను చేసిన పనికి ట్రాఫిక్ కు బదిలీ అవుతాడు. ఇలాంటి స్థితిలో అతడి నిజాయితీని గుర్తించిన ఒక పోలీస్ ఉన్నతాధికారి హైదరాబాద్ కు రప్పిస్తాడు. అతడికో పెద్ద ఆపరేషన్ అప్పగిస్తాడు. ఆ ఆపరేషన్ ఏంటి.. దాన్ని ఛేదించడానికి అల్లూరి ఎక్కడిదాకా వెళ్లాడు.. అతడికి ఎదరైన అనుభవాలేంటి.. చివరికి అతను అనుకున్నది సాధించాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

అల్లూరి సినిమాలో హీరో పోలీస్. పట్టపగలు నడి రోడ్డు మీద ఎంపీకి రైట్ హ్యాండ్ అయిన ఒక రౌడీ హత్య చేస్తే.. దాని గురించి హీరో అడిగితే సాక్ష్యం చెప్పడానికి ఎవ్వరూ ముందుకు రారు. తర్వాత ఆ రౌడీ ఎంపీ కొడుకు కలిసి ఒక అమ్మాయిపై అఘాయిత్యం చేస్తారు. ఇక బతకడం కష్టమని తెలిశాక ఆసుపత్రి నుంచి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంతకుముందు హత్య జరిగిన చోటే తనను కూర్చోబెట్టి ఎంపీ కొడుక్కి రౌడీలకు తగిన శిక్ష వేస్తాడు హీరో. అప్పుడు చట్టాన్ని అతిక్రమించి హీరో చేసిన న్యాయానికి సెల్యూట్ కొడుతూ.. అతడికి వ్యతిరేకంగా ఎవ్వరూ సాక్ష్యం చెప్పరు. పోలీస్ అయిన హీరో ఇలా విలన్లకు బుద్ధి చెప్పే సన్నివేశాలు చాలా సినిమాల్లో చాలా చూసి ఉండొచ్చు. అయినా సరే.. అల్లూరిలో ఈ ఎపిసోడ్ చూసినపుడు గూస్ బంప్స్ గ్యారెంటీ. మాస్ సినిమాలకు ఉన్న ప్లస్ ఏంటంటే.. రొటీన్ అనిపించినా సరే.. ఎమోషన్ కరెక్టుగా సెట్ అయితే ఎలివేషన్ కుదిరితే విజిల్స్ పడిపోతాయి.

ఐతే ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఈ ఎపిసోడ్ తో కథ రసకందాయంలో పడిందని.. ఇక హీరో వెర్సన్ విలన్ వార్ ఇంకో స్థాయికి చేరుతుందని.. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు తలపడతారని ఎంతో ఆశిస్తాం. కట్ చేస్తే.. హీరో అక్కడి నుంచి బదిలీ అయిపోతాడు. ఆ విలన్ తో కనెక్షన్ అయిపోతుంది. ద్వితీయార్ధం నుంచి కొత్త కథ మొదలవుతుంది. మళ్లీ జీరో నుంచి స్టార్ అన్నట్లే. మరి అంత కష్టపడి ఒక ఫ్లాట్ ఫామ్ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రదీప్ వర్మ.. ఆ కథనే కొనసాగించి మాస్ విందు పంచే అవకాశాన్ని ఎందుకు వదులుకున్నాడో అర్థం కాదు. మళ్లీ కొత్తగా ఓ ఆపరేషన్ మొదలుపెట్టి.. దాని మీద కథను నడిపించడంతో అప్పటిదాకా ఉన్న ఇంటర్వెల్ కు ముందు వచ్చిన హై కంటిన్యూ అవదు. పోనీ హీరో చేపట్టిన కొత్త ఆపరేషన్ అంతకుముందు చూసిన కథ కన్నా ఎగ్జైటింగ్ గా ఉందా అంటే అదీ లేదాయె. ఒక రకంగా చెప్పాలంటే దర్శకుడు ఒక టికెట్ మీద రెండు సినిమాలు చూపించాలనుకున్నాడు. ప్రథమార్ధం వరకు ఒక సినిమా చూపించి.. ఇంటర్వెల్ నుంచి ఇంకో సినిమాను మొదలుపెట్టాడు. ప్రథమార్ధంలో చూసిన కథ రొటీన్ గా అనిపించినా సరే.. కొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లు.. హీరో శ్రీ విష్ణు పెర్ఫామెన్స్ వల్ల ఎంగేజింగ్ గానే అనిపిస్తుంది. కానీ సుదీర్ఘంగా.. సాగతీతగా అనిపించే ద్వితీయార్ధం సినిమా గ్రాఫ్ ను తగ్గించేసింది. కానీ శ్రీ విష్ణు సినిమాను నిలబెట్టడానికి గట్టి ప్రయత్నమే చేశాడు.

మామూలుగా హీరో పోలీస్ అంటే మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలకే బాగుంటుంది. క్లాస్ టచ్ ఉన్న.. డిఫరెంటుగా ఉండే.. సామాన్యుడి పాత్రలు చేసే శ్రీవిష్ణుకు ఫెరోషియస్ పోలీస్ క్యారెక్టర్ సెట్ అవదనే అనుకుంటాం. ఐతే ఆ పరిమితులేమీ పెట్టుకోకుండా శ్రీవిష్ణు మాత్రం సిన్సియర్ పెర్ఫామెన్స్ ఇవ్వడం ద్వారా అల్లూరి పాత్రను నిలబెట్టడానికి గట్టి ప్రయత్నమే చేశాడు. కొన్ని ఎపిసోడ్లను పక్కన పెడితే.. కథాకథనాలు బలహీనంగా ఉన్న ఈ సినిమాను డ్రైవ్ చేసేది అల్లూరి పాత్ర.. శ్రీవిష్ణు పెర్ఫామెన్సే. డ్యూటీని ప్రాణంగా భావించే.. నిజాయితీకి మారుపేరైన ఒక పోలీస్ జర్నీని చూపించాలనుకున్న దర్శకుడు.. ప్రథమార్ధంలో చూపించిన కథకు మధ్యలో బ్రేక్ వేసి.. హీరోను కొత్త టాస్క్ వైపు మళ్లించాలని చూశాడు. ఈ ఆపరేషన్ ద్వితీయార్ధంలో ప్రేక్షకులు కొత్త అనుభూతిని ఇస్తుందని అతను అనుకుని ఉండొచ్చు. కానీ అది మరో రకమైన.. నెగెటివ్ ఫీలింగ్ ఇచ్చింది. సెకండాఫ్ బాగా సాగతీతగా అనిపించడం.. నిడివి ఎక్కువ అయిపోవడం కూడా ప్రతికూలతలుగా మారాయి. అయినప్పటికీ శ్రీ విష్ణు పెర్ఫామెన్స్ కోసం.. కొన్ని ఎపిసోడ్ల కోసం అల్లూరిపై ఒక లుక్కేయొచ్చు.

నటీనటులు:

ఈ మధ్య కొన్ని మాస్ పాత్రలు ట్రై చేసి దెబ్బ తిన్న శ్రీ విష్ణు.. అల్లూరిగా పోలీస్ పాత్రలో ఆశ్చర్యపరిచే పెర్ఫామెన్స్ ఇచ్చాడు.ఈ పాత్ర ఎవరైనా స్టార్ హీరో చేస్తే బావుండేది అన్న ఫీలింగ్ కలుగుతుంది కానీ.. ఓపెన్ మైండ్ తో చూస్తే విష్ణు పెర్ఫామెన్స్ మంచి కిక్ ఇస్తుంది. అతడి కెరీర్లో గుర్తుంచుకోదగ్గ పాత్రల్లో ఇది ఒకటి. సినిమా ఆద్యంతం అతను చూపించిన ఇంటెన్సిటీ ప్రశంసనీయం. సినిమాను విష్ణు తన భుజాల మీద మోశాడని చెప్పొచ్చు. హీరోయిన్ కాయదు చూడ్డానికి అందంగా ఉంది. నటన పర్వాలేదు. తనికెళ్ల భరణి చాన్నాళ్ల తర్వాత మంచి పాత్రతో ఆకట్టుకున్నారు. ఆయన క్యారెక్టర్ హృద్యంగా అనిపిస్తుంది. రాజారవీంద్ర ఓకే. విలన్ పాత్రలో మధు మామూలుగా అనిపిస్తాడు. సినిమాలో ఇంతకుమించి గుర్తుంచుకోదగ్గ పాత్రల్లేవు.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా అల్లూరి సోసోగా అనిపిస్తుంది. అర్జున్ రెడ్డికి అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు పాటలు.. నేపథ్య సంగీతం విషయంలో ఆశించిన ఔట్ పుట్ ఇవ్వలేదు. పాటలేవీ వినసొంపుగా లేవు. రాజ్ తోట ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. బడ్జెట్ పరిమితులు తెరపై కనిపిస్తాయి. రైటర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ వర్మ కొంత ప్రయత్నం అయితే చేశాడు కానీ.. పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. రైటింగ్ దగ్గర బలహీనంగా కనిపించిన అతను.. దర్శకుడిగా కొన్ని చోట్ల మెరుపులు మెరిపించాడు. కానీ కన్సిస్టెన్సీ చూపించలేకపోయాడు. అతడి పనితనానికి యావరేజ్ మార్కులు పడతాయి.

చివరగా: అల్లూరి ఒక టికెట్ పై రెండు సినిమాలు

రేటింగ్ 2.5/5

Leave a Reply

Your email address will not be published.

Back to top button
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock