NEWSPOLITICS

కోహ్లిలా కాదు.. రహానేది మరో రకమైన కెప్టెన్సీ వివాదం

కోహ్లిలా కాదు.. రహానేది మరో రకమైన కెప్టెన్సీ వివాదం

Fri Feb 11 2022 19:00:01 GMT+0530 (IST)

Not like Kohli  Rahane is another kind of captaincy controversy

అజింక్య రహానే.. ఈ టీమిండియా క్రికెటర్ ది చిత్రమైన ప్రస్థానం. భారత్ తరఫున ఇంగ్లండ్ పై టి20ల ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసి.. దూకుడైన ఆటతో ఆరంభంలోనే ఆకట్టుకున్నాడు. వన్డేల్లోనూ రాణించి.. ఓ దశలో వరుస అర్ధ శతకాలతో మెప్పించాడు.. తర్వాత టెస్టుల్లో కీలక ఆటగాడిగా ఎదిగి.. విదేశీ వేదికలపై సెంచరీలతో వైస్ కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. అంతా బాగుంటే.. ప్రస్తుత టీమిండియా టెస్టు కెప్టెన్ అవ్వాల్సినోడు. కానీ అతడు ఫామ్ కోల్పోయి.. ఆటతీరు దిగజారి జట్టులో చోటే ప్రశ్నార్థకమైంది. వైస్ కెప్టెన్సీ ఊడింది. ఇప్పుడిక టీమిండియాలో చోటు కావాలంటే రంజీ ట్రోఫీలో ఆడి ప్రతిభ చాటాల్సిన పరిస్థితి. అందుకే బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ సూచన మేరకు ఈ నెలలో మొదలుకానున్న రంజీ ట్రోఫీ ఆడేందుకు ముంబై తరఫున బరిలో దిగుతున్నాడు రహానే.

అసలైన టెస్టు క్రికెటర్.. ఇలా అయ్యాడేంటి?

ప్రతిభలో రహానే గురించి వంక పెట్టేదేమీ లేదు. అండర్ 19 స్థాయి నుంచి కోహ్లి జడేజాలతో ఆడినవాడు. టి20ల ద్వారా అరంగేట్రం చేశాడంటేనే ఈ కాలపు బ్యాట్స్ మన్ అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఎటొచ్చీ అతడికి కాలం కలిసిరాలేదు. టి20లకు అన్ ఫిట్ అయ్యాడు. వన్డేల్లో అద్భుతంగా రాణించినా.. ఎందుకనో అది మరుగునపడింది. ఓ సమయంలో వరుసగా అయిదో ఆరో అర్థ శతకాలతో రహానే మాంచి ఊపు మీద కనిపించాడు. కానీ సెలక్టర్లను మెప్పించలేకపోయాడు. తర్వాతి సిరీస్ లకు చోటు సంపాదించలేకపోయాడు. ఏమైతేనేం టెస్టుల్లో నిలకడగా ఆడుతూ విదేశాల్లో కీలక ఆటగాడిగా ఎదిగాడని అనుకుంటుండగా.. రెండేళ్లుగా ఫామ్ కోల్పోయి పెద్ద

తలనొప్పిగా మారాడు. ఇతడితో పాటు టెస్టుల్లో మరీ కీలక ఆటగాడు చతేశ్వర్ పుజారా కూడా ఫామ్ లో లేకపోవడం జట్టుకు చాలా ఇబ్బందిగా మారింది. కాగా చివరిసారిగా రహానే తనదైన శైలిలో సెంచరీ చేసింది 2019- 2020 ఆస్ట్రేలియా టూర్ లో. అప్పటినుంచి తన ఆటతీరు దిగజారుతూ వచ్చింది.

గెలిపించిన సిరీస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు

2019-20 ఆస్ట్రేలియా టూర్ లో టీమిండియా చారిత్రక విజయం సాధించిన సంగతి తెలిసిందే. 36 పరుగులకే ఆలౌటై జట్టు పరువు పోయి.. కూతురు పుట్టిన సందర్భంలో కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో టెస్టు నుంచి దూరం కాగా.. రహానే ముందుండి నడిపించాడు. మెల్బోర్న్ టెస్టులో అద్భుత సెంచరీతో గెలిపించాడు. ఆపై షమీ బుమ్రా వంటి కీలక పేసర్లు దూరమైనా సిరాజ్ వంటి వారితో బౌలింగ్

దళాన్నినడిపించాడు. కోహ్లి లేకున్నా గిల్ పంత్విహారి లతో బ్యాటింగ్ భారాన్ని మోశాడు. ఆ సిరీస్ ను 2-1తో గెలిచి చరిత్రలో నిలిచిపోయాడు. కంగారూ గడ్డపై మనకు అదే తొలి సిరీస్ కావడమే దీనికి కారణం. ఇప్పుడిదే సిరీస్ పై రహానే కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను కెప్టెన్సీ చేసి గెలిపించిన సిరీస్ ఘనతను మరెవరో వారి ఖాతాలో వేసుకోవాలని చూశారని అన్నాడు. నాడు జట్టుతో రోహిత్

శర్మ లేడు కోహ్లి కూడా లేడు. అంటే రవిశాస్త్రిని ఉద్దేశించే రహానే మాట్లాడినది అని తెలుస్తోంది. సిరీస్ విజయానికి తన నిర్ణయాలు కారణమైతే.. మరొకరు తమ ఘనతగా చెప్పుకున్నారని రహానె విమర్శించాడు. వాస్తవానికి ఆనాటి విజయంతో అప్పటి కోచ్ రవిశాస్త్రిని మీడియా ఆకాశానికెత్తేసింది. కాగా ఆస్ట్రేలియాలో ఏం చేశానో తనకు తెలుసు అని.. దాని గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని రహానె వ్యాఖ్యానించాడు. మరొకరి ఘనతను తీసుకునే స్వభావం తనది కాదన్నాడు. మైదానంలో డ్రెస్సింగ్ రూంలో కొన్ని విషయాలపై తాను నిర్ణయాలు తీసుకున్న మాట వాస్తవమని.. కానీ ఆ ఘనతనే వేరొకరు తీసుకున్నారని.. అయితే తాము సిరీస్ గెలిచామన్నదే

తనకు ముఖ్యమని.. అదొక చారిత్రక సిరీస్ అని రహానె అభిప్రాయపడ్డాడు. ‘అది నేనే చేశాను.. ఫలానా మలుపుకు నేనే కారణం’ అని వేరొకరు గొప్పగా చెప్పుకున్నారని.. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాని ఎద్దేవా చేశాడు. తన సామర్థ్యంపై తనకు నమ్మకం ఉందని.. తనలో

ఇంకా క్రికెట్ మిగిలే ఉందని రహానె స్పష్టం చేశాడు.

ఇంతకీ గెలుపు ఘనత ఎవరిది? ఇప్పుడీ వ్యాఖ్యలు అవసరమా?

ఆస్ట్రేలియాలో టెస్టు గెలవడమే గొప్పంటే ఏకంగా రహానే సారథ్యంలో సిరీస్ తీసుకొచ్చారు మనవాళ్లు. మైదానంలో కెప్టెన్ అయిన అతడిదే ఈ ఘనత. అయితే క్రికెట్ వంటి జట్టు క్రీడలో ఏ ఒక్కరికో గొప్పదనాన్ని ఆపాదించలేం. తెరవెనుక కోచ్ గా రవిశాస్త్రి పాత్ర కూడా ఉండి ఉంటుంది. అయితే ఆటలో కెప్టెన్ దే బాధ్యత కాబట్టి కొంచెం ఎక్కువ ఘనత తనకే చెందుతుంది. దీనిని నాడు క్రికెట్ ప్రపంచం గుర్తించింది కూడా. ఇవన్నీ పక్కనబెడితే అసలు ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు రహానేకు పూర్తిగా అనవసరం. ఎందుకంటే.. సిరీస్ గెలిచి రెండేళ్లయింది. ఆస్ట్రేలియాలో మళ్లీ ఆ వెంటనే సిరీస్ నూ భారత్ గెలిచింది. రవిశాస్త్రి కోచ్ గా తప్పుకొన్నాడు. అన్నిటికి మించి రహానే కెరీరే డోలాయమానం లో ఉంది. అతడు వైస్ కెప్టెన్ కాదు కదా? కనీసం జట్టులో చోటే లేని స్థితికి చేరుకున్నాడు. రంజీల్లో ప్రతిభ చాటితేనే టీమిండియాలో చోటు నిలిచే పరిస్థితుల్లో కెరీర్ గురించి ఆలోచించకుండా గతాన్ని తవ్వుకోవడం ఏమాత్రం సముచితం కాదు.

Leave a Reply

Your email address will not be published.

Back to top button
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock