MOVIE REVIEWS

గుడ్ లక్ సఖి

గుడ్ లక్ సఖి

Fri Jan 28 2022 GMT+0530 (IST)

గుడ్ లక్ సఖి

చిత్రం : గుడ్ లక్ సఖి

నటీనటులు: కీర్తి సురేష్-జగపతిబాబు-ఆది పినిశెట్టి-రాహుల్ రామకృష్ణ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: చిరంతన్ దాస్
నిర్మాత: సుధీర్ చంద్ర
రచన-దర్శకత్వం: నగేష్ కుకునూర్

‘మహానటి’
తర్వాత తరచుగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది కీర్తి సురేష్. కానీ
అవేవీ ఆమెకు ఆశించిన ఫలితాలనివ్వట్లేదు. పెంగ్విన్.. మిస్ ఇండియా ఎంతగా
నిరాశ పరిచాయో తెలిసిందే. ఇప్పుడు ‘గుడ్ లక్ సఖి’ అంటూ మరోసారి హీరోయిన్
ఓరియెంటెడ్ మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది కీర్తి. ఈ
రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంతో అయినా కీర్తి అంచనాలను
అందుకుందేమో చూద్దాం పదండి.

కథ:

సఖి (కీర్తి సురేష్) ఒక
మారుమూల పల్లెటూరిలో పేద కుటుంబానికి చెందిన అమ్మాయి. కష్టపడి జీవనాన్ని
సాగిస్తున్న ఆమెకు రాజు (ఆది పినిశెట్టి) అనే చిన్ననాటి స్నేహితుడి
ప్రోత్సాహంతో షూటింగ్లోకి అడుగు పెడుతుంది. పల్లెటూరిలో షూటింగ్ అకాడమీ
పెట్టి మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తేవాలని చూస్తున్న మాజీ కల్నల్
(జగపతిబాబు).. సఖిలో ప్రతిభను గమనించి షూటింగ్ ఇస్తాడు. ఐతే శిక్షణ
తీసుకునే క్రమంలో కల్నల్ తో సాన్నిహిత్యం పెరిగి సఖి ఆయనకు దగ్గరయ్యాక రాజు
ఆమెకు దూరమవుతాడు. మరి కల్నల్ తో సఖి ప్రయాణం ఎక్కడిదాకా వెళ్లింది.. ఆమె
షూటింగ్ ఛాంపియన్ అయిందా.. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన అడ్డంకులేంటి.. అన్నది
తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

కీర్తి సురేష్..
జగపతిబాబు.. ఆది పినిశెట్టి లాంటి పేరున్న నటీనటులు.. దేవివ్రీ
ప్రసాద్-శ్రీకర్ ప్రసాద్ లాంటి ఉద్ధండులైన టెక్నీషియన్లు.. ఈ ప్రాజెక్టును
నమ్మి సమర్పకుడిగా వ్యవహరించిన దిల్ రాజు.. వీళ్లందరికీ మించి హైదరాబాద్
బ్లూస్-ఇక్బాల్ లాంటి గొప్ప సినిమాలతో అవార్డులు రివార్డులు గెలుచుకున్న
ప్రఖ్యాత దర్శకుడు నగేష్ కుకునూర్.. ఇలాంటి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా
మీద అభిరుచి ఉన్న ప్రేక్షకులు కచ్చితంగా అంచనాలు పెట్టుకుంటారు. రెగ్యులర్
మాస్ మసాలా సినిమాలు చూసే ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమా పెద్దగా
ఆదరించకపోయినా.. అందువల్ల బజ్ రాకపోయినా ఓ వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా మీద
మంచి నమ్మకమే ఉంది. అందులోనూ నగేష్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ‘ఇక్బాల్’
లాంటి మరపురాని సినిమాను అందించిన నేపథ్యంలో.. మళ్లీ ఆయన ఆ జాన్లో సినిమా
తీశాడంటే ఇంకా ఎక్కువ ఆశిస్తాం. కానీ ‘గుడ్ లక్ సఖి’ సినిమా మొదలైన
దగ్గర్నుంచి చివరి దాకా ఎక్కడా నగేష్ ముద్ర కనిపించక.. ఒక దశలో నిజంగా ఆయనే
ఈ సినిమా తీశాడా అన్న సందేహం కలుగుతుంది. నగేష్ కెరీర్లో చాలా కిందన ఉండే
సినిమాల్లో సైతం కొన్ని మెరుపులుంటాయి. కానీ ఇందులో మాత్రం ఎక్కడా చిన్న
స్పార్క్ కూడా లేదు. ఇంతమంది పేరున్న ఆర్టిస్టులు.. టెక్నీషియన్లు కలిసి
ఇలాంటి సినిమా ఎలా తీశారా అన్న ఆశ్చర్యంతో థియేటర్ నుంచి బయటికి రావడం
ప్రేక్షకుడి వంతవుతుంది.

తన సినిమాలన్నింట్లోనూ ఒక ఒరిజినాలిటీ
చూపించిన నగేష్ కుకునూర్.. ‘గుడ్ లక్ సఖి’లో మాత్రం వేరే సినిమాను
అనుకరించడంతోనే ఇది ఆయన మార్కు సినిమా కాదు అనే విషయం మధ్యలోనే
అర్థమైపోతుంది. వెంకటేష్ ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘గురు’ సినిమా స్ఫూర్తి ఈ
చిత్రంలో కనిపిస్తుంది. ఒక సిన్సియర్ కోచ్.. అతడి దగ్గరికి శిక్షణకు వచ్చే
ఒక పేదింటి అమ్మాయి.. తనకు అన్నీ తానై వ్యవహరించే గురువును చూసి
ఆకర్షితురాలయ్యే అమ్మాయి.. ఈ థ్రెడ్ దాదాపుగా ‘గురు’ సినిమాను తలపిస్తుంది.
కాకపోతే ‘గుడ్ లక్ సఖి’లో మధ్యలో హీరోయిన్ కు జోడీగా వేరే అబ్బాయిని
పెట్టారు.

అన్నింటి కంటెంట్ పరంగా చూసుకుంటే ‘గురు’కి.. ‘గుడ్ లక్
సఖి’కి కనిపించే అతి పెద్ద వ్యత్యాసం ఎమోషన్. అందులో ప్రధాన పాత్రల బ్యాక్
స్టోరీలతో మొదలుపెట్టి.. ప్రతిదాంట్లోనూ ఒక ఎమోషన్ ఉంటుంది. ‘గుడ్ లక్ సఖి’
పూర్తిగా ఎమోషన్ లెస్ గా సాగి.. ఏ దశలోనూ ప్రేక్షకుల్లో కదలిక తీసుకురాదు.

ఒక
మాజీ సైనికాధికారి వచ్చి ఒక పల్లెటూరిలో షూటింగ్ అకాడమీ పెట్టడానికి
ప్రత్యేకంగా కారణమంటూ ఏమీ కనిపించదు. ఏదో వస్తాడు.. అకాడమీ పెడతాడు.
ఛాంపియన్లను తయారు చేస్తానంటాడు. దాని వెనుక ఒక బలమైన కారణం.. ఏదైనా అవమాన
కోణం లాంటివేమీ ఉండవు. కోచ్ కు సంబంధించి చెప్పుకోదగ్గ బ్యాక్ స్టోరీ ఏమీ
లేకుండా ఆయన ఆయన ఈ పాత్రతో ఎలా కనెక్టవుతాం? పోనీ హీరోయిన్ విషయంలో అయినా
స్ట్రాంగ్ ఎమోషన్ ఉందా అంటే అదీ లేదు. ఊర్లో వాళ్లు ఆమె అంటేనే ‘బ్యాడ్
లక్’ అంటూ ఆటపటిస్తుంటారు. దీన్ని కథానాయిక పెద్దగా పట్టించుకోదు కూడా. ఇక
హీరోయిన్ని ప్రేమించే అబ్బాయి కథలోనైనా ఏమైనా విషయం ఉందా అంటే అదీ లేదు.
ఊర్లల్లో నాటకాలేసుకునే అతడి పాత్ర అందుకు తగ్గట్లే పాత స్టయిల్లో
నడుస్తుంది. ఇలా జీవం లేని ప్రధాన పాత్రలు.. ఏమాత్రం ఎమోషన్ లేని వాళ్ల
నేపథ్యాలతో ‘గుడ్ లక్ సఖి’ ప్రేక్షకుల్లో ఆసక్తిని చంపేయడానికి ఏమాత్రం
సమయం పట్టదు.

నెగెటివ్ షేడ్స్ ఉన్న రాహుల్ రామకృష్ణ పాత్ర కాస్త
ఆసక్తి రేకెత్తించినా.. అదెక్కడ హైలైట్ అయిపోతుందో అన్నట్లు దాన్ని
మధ్యలోనే చంపేశాడు దర్శకుడు. ఇక అంతే.. ‘సఖి’ ఎక్కడా లేవదంతే.

ఓవైపు
హీరోయిన్ని ప్రేమించే రాజు ఊరికే అపార్థం చేసుకుంటున్నట్లు చూపించి..
తర్వాత నిజంగానే సఖి కోచ్ ప్రేమలో పడిపోయినట్లు చూపించడంలో ఔచిత్యం
కనిపించదు. ఓవైపు రాజును అమితంగా అభిమానిస్తున్నట్లే కనిపించి కోచ్ తో
కారణం లేకుండా ప్రేమలో పడిపోతుంది సఖి. వీళ్ల ప్రేమ కథ చాలా అసహజంగా..
సిల్లీగా కనిపించి తెరమీద జరుగుతున్న తంతు చికాకు పెడుతుంది. ఇక ఆటకు
సంబంధించిన అంశాలనైనా సరిగ్గా చూపించారా అంటే అదీ లేదు. ఆట ఏదైనప్పటికీ
ఉత్కంఠ.. డ్రామా ఆశిస్తాం. కానీ చాలా పేలవమైన సన్నివేశాలతో అది కూడా ఎక్కడా
ఎగ్జైటింగ్ గా అనిపించదు. చివర్లో బలవంతంగా డ్రామా క్రియేట్ చేయడానికి
చూశారు కానీ.. అది కూడా తుస్సుమనిపించింది. ఒక ఛాంపియన్ షిప్ జరుగుతుంటే..
అక్కడ కామెంటేటర్లుగా కూర్చున్న వాళ్ల మాటలు చూస్తుంటే నగేష్ కుకునూర్
‘ఇక్బాల్’ నుంచి ఏ స్థాయికి పడిపోయాడో అర్థమవుతుంది. అనుభవం.. పేరు లేని
ఇంకో దర్శకుడెవరో ఇలాంటి సినిమా తీస్తే ఏమో అనుకోవచ్చు కానీ.. నగేష్ నుంచి ఈ
తరహా చిత్రం ఆయన్ని అభిమానించే వారికిపెద్ద షాకే.

నటీనటులు:

కీర్తి
సురేష్ తన వంతుగా సఖి పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించింది. పాత్రకు
తగ్గట్లుగా తన ఆహార్యం.. డైలాగ్ డెలివరీ.. నటన.. అన్నీ బాగున్నాయి. కానీ
పాత్రలోనే విషయం లేకపోయింది. కీర్తి కెరీర్లో అత్యంత పేలవమైన
క్యారెక్టర్లలో ఇదొకటిగా నిలుస్తుంది. ఇలాంటి కథను కీర్తి ఎలా ఒప్పుకుందో
అర్థం కాదు. జగపతిబాబు ఉన్నంతలో బాగా చేసినా.. ఆయన క్యారెక్టర్ కూడా చాలా
సాధారణంగా అనిపిస్తుంది. ఆది పినిశెట్టి ప్రతిభ కూడా వృథా అయింది. రాహుల్
రామకృష్ణ బాగానే చేశాడు. మిగతా ఆర్టిస్టుల్లో ఎవరికీ చెప్పుకోదగ్గ పాత్ర
పడలేదు. ఎవరి గురించీ చెప్పడానికేమీ లేదు.

సాంకేతిక వర్గం:

దేవిశ్రీ
ప్రసాద్ సంగీతంలో అతడి మార్కు కనిపించలేదు. నిజానికి అతడి శైలి ఈ తరహా
సినిమాలకు సెట్టవ్వదు. దేవి కొంచెం భిన్నంగా చేయడానికి ప్రయత్నించాడు
కానీ.. అనుకున్నంత ఔట్ పుట్ రాలేదు. రెండు పాటలు పర్వాలేదనిపిస్తాయి.
నేపథ్య సంగీతం జస్ట్ ఓకే అనిపిస్తుంది. చిరంతన్ దాస్ ఛాయాగ్రహణం ఓకే.
నిర్మాణ విలువలు ఉండాల్సినంత స్థాయిలో లేవు. టెక్నీషియన్లుగా పేరున్న
వాళ్లను పెట్టుకున్నప్పటికీ.. నిర్మాణ విలువల విషయంలో కొంచెం రాజీ
పడ్డారనిపిస్తుంది. బహుశా మధ్యలో బడ్జెట్ సమస్యలు తలెత్తాయేమో. దర్శకుడు
నగేష్ కుకునూర్ విషయానికి వస్తే.. ముందే అన్నట్లు ఈ స్క్రిప్టు ఆయనే రాసి..
ఆయనే తీశాడా అన్న అనుమానం కలుగుతుంది. అంత సాధారణంగా అనిపిస్తాయి
కథాకథనాలు. రచయితగా.. దర్శకుడిగా ఎక్కడా ఆయన ముద్ర కనిపించలేదు. నగేష్
కెరీర్లోనే అత్యంత పేలవమైన సినిమాగా నిలవడానికి ‘గుడ్ లక్ సఖి’ గట్టి
పోటీదారే.

చివరగా:  బోరింగ్ సఖి

రేటింగ్-2/5

Disclaimer
: This Review is An Opinion of One Person. Please Do Not Judge The
Movie Based On This Review And Watch Movie in Theatre

Leave a Reply

Your email address will not be published.

Back to top button
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock