NEWS

రజనీతో సినిమా అంటే మాటలా?

రజనీతో సినిమా అంటే మాటలా?

Fri Feb 11 2022 15:00:01 GMT+0530 (IST)

Nelson delip kumar movie with rajnikanth

టాలీవుడ్ లో అడుగుపెట్టే దర్శకులు చిరంజీవితో సినిమా చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకుంటారు. ఆయనతో సినిమా చేసే ఛాన్స్ వస్తే తమ ఆశయం నెరవేరినట్టుగానే భావిస్తుంటారు. అలాగే కోలీవుడ్ కి కొత్తగా వచ్చే దర్శకుల ‘కల’ రజనీతో సినిమా చేయడమే. ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టిన కుర్ర దర్శకులకు ఆయన ఎక్కడో మేరుపర్వతంలా కనిపిస్తుంటారు. ఆ పర్వతం శిఖరం మాత్రమే కనిపిస్తుంటుంది. కానీ దగ్గరకి వెళ్లడం చాలా కష్టమనే విషయం చాలా మందికి తెలుసు. అక్కడికి చేరుకునే ఒక రోజు కోసమే చాలామంది ఎదురుచూస్తుంటారు.

రజనీకాంత్ ని కలుసుకోవడమే కష్టం .. ఆయనకి కథ చెప్పడం ఇంకా కష్టం .. ఒప్పించడం మరింత కష్టం. ఇన్ని కష్టాలను అధిగమిస్తేనే తప్ప ఆయనతో సినిమా చేయడం అసాధ్యం. అదే రజనీకాంత్ తమతో సినిమా చేయాలనే ఆసక్తిని కనబరిచేలా చేయగలిగితే ఆయనతో సినిమా చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆయన యువ దర్శకులతో సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. అందువలన ఆయన దృష్టిలో పడేలా నెల్సన్ దిలీప్ కుమార్ తనని తాను నిరూపించుకుంటూ వెళ్లాడు.

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడమంటే థియేటర్లోకి అడుగుపెట్టడమంత తేలిక కాదనే విషయం తొలి రోజుల్లోనే నెల్సన్ కి అర్థమైపోయింది. అవకాశాలు వచ్చినట్టే వచ్చి జారిపోతున్నా .. ఊరించి ఉసూరుమనిపించేలా చేసినా ఆయన ఓర్పుతో సరైన అవకాశం కోసం  ఎదురుచూస్తూనే ఉన్నాడు. అలా మొత్తానికి నయనతార ప్రధాన పాత్రగా ఆయన ‘కొలమావు కోకిల’ సినిమా చేశారు. ఈ కథలో నయనతార పైకి అమాయకంగా .. బుద్ధిమంతురాలిగా కలిపిస్తూనే కుటుంబ పరిస్థితుల కారణంగా డ్రగ్స్ సప్లై చేస్తుంటుంది.

చాలా తక్కువ ఖర్చుతో చేసిన ఈ సినిమా తమిళనాట భారీ విజయాన్ని అందుకుంది. అయితే తెలుగులో సరైన టైటిల్ పెట్టకపోవడం వలన ఈ సినిమాను ఇక్కడి ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. ఇక ఈ మధ్య తమిళంలో ఆయన చేసిన ‘డాక్టర్’ మాత్రం ఇక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. నెల్సన్ టేకింగ్ నచ్చడంతో విజయ్ పిలిచి మరీ తన సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడు. అలా పట్టాలపైకి వెళ్లిన ‘బీస్ట్’ .. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆయన విజయ్ ను మరింత స్టైల్ గా చూపించాడనే విషయం పోస్టర్స్ తోనే అర్థమైపోతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుండగానే ఆయనకి రజనీ నుంచి పిలుపు రావడం విశేషం.

రజనీ పిలిచి మరీ నెల్సన్ కి ఛాన్స్ ఇవ్వడం ఆయన టాలెంట్ కి లభించిన గుర్తింపు అనే అనుకోవాలి. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా సెట్ అయినట్టుగా సన్ పిక్చర్స్ వారు అధికారిక ప్రకటన వదిలారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను .. వీడియోను కూడా రిలీజ్ చేశారు.

 అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నట్టుగా చెప్పారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతోంది. ఇండస్ట్రీకి చాలా కాలం క్రితం వచ్చిన చాలామంది దర్శకులు రజనీతో సినిమా చేయడానికి ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. అలాంటిది పట్టుమని అరడజను సినిమాలు కూడా చేయని నెల్సన్ కి రజనీతో సినిమా చేసే ఛాన్స్ రావడం విశేషమేనని చెప్పుకోవాలి! అది ఆయన ప్రతిభ చూపించిన ప్రభావమేనని ఒప్పుకోవాలి!!          

Leave a Reply

Your email address will not be published.

Back to top button
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock